నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి
గురికాని వారి, అపమార్గానికి
లోనుకాని వారి మార్గం (చూపు).
65. సూరా అత్ తలాఖ్
1) ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్
విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు.
నీకు తెలీదు – బహుశా అల్లాహ్ దీని
తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో!
2) ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి
అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు.
3) అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని
సమకూరుస్తాడు. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన
కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.
(ఓ ముహమ్మద్-సఅసం!) నీకు
పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారివద్దకు మేము మా సందేశాన్ని
(వహీని) పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను (గ్రంథవహులను) అడిగి
తెలుసుకోండి.
ఆ
తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారినీ, ఇంకా మేము కోరిన వాళ్ళనూ
కాపాడాము. హద్దుమీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాము.
''అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ
సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి'' అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ''మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి
కార్యసాధకుడు'' అని
వారన్నారు.
ఇక వారు గనక
వైముఖ్యధోరణిని కనబరుస్తే “నాకు
అల్లాహ్ చాలు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు. నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను.
ఆయన మహోన్నతమైన పీఠానికి (అర్ష్‌కు) అధిపతి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
(ఓ ముహమ్మద్ - సఅసం!) మేమీ గ్రంథాన్ని
సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు -
ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ!
జాగ్రత్త!
నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా
ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, "ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి
చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ"ని
అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన
(అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ
సన్మార్గం చూపడు.
అల్లాహ్
(ఎవరినయినా) సంతానంగా చేసుకోదలచుకుంటే, తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. (కాని) ఆయన పరమ
పవిత్రుడు. ఆ అల్లాహ్ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు.
నీ ప్రభువు
స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల
యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే
వారి ముందు (విసుగ్గా) "ఊహ్'' అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు.
"ఆయనను వదలి మీరు
పూజిస్తున్నవి మీరూ, మీ తాత
ముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి
అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్‌కు తప్ప
వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ.
ఇదే సరైన - స్థిరమైన - ధర్మం. కాని చాలామంది ఈ విషయాన్నితెలుసుకోరు.
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ''ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు
రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు.
అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.'' ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ''మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న
విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని వారికి చెప్పేయండి.
(ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి
ఉన్నామో వారు, నీపై అవతరింపజేయబడే
దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాలవారు ఇందులోని కొన్ని భాగాలను
తిరస్కరిస్తున్నారు. "నేను అల్లాహ్‌ను ఆరాధించాలనీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే
నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను. ఆయన వైపే నేను
మరలుతున్నాను" అని నువ్వు వారికి చెప్పేయి.
ఆ అల్లాహ్‌యే
మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు
ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే
మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత
మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే
భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు
కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు.
ప్రతి
ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు
ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా
అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని
మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను
త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో.
మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు
సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు
తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి
కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు.
(జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని
(కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా
చేసుకోండి. “నా గృహాన్ని
(సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం
తీసుకున్నాము.
మేము
ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్థారించినపుడు పెట్టిన షరతు ఇది: నాకు
భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి.
మీరు మీ ముఖాలను
తూర్పు దిక్కుకో, పడమర
దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ
ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం-
ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.
“అల్లాహ్
అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి
చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు
సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ
విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!)
అల్లాహ్
(మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ
మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న
సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి
ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ
విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి
ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
ధర్మం
విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక
ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను
మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు.
అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
విశ్వసించినవారి
సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు
తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల
వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం
అందులోనే పడి ఉంటారు.
ఆకాశాలలో, భూమిలో ఉన్న
ప్రతి వస్తువూ అల్లాహ్‌దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక
దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన
వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌కు అన్నింటిపై అధికారం ఉంది.
తన ప్రభువు
తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా
(సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన
గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన
(పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ
పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను
అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
అల్లాహ్ ఏ
ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే
లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది.
(ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము
పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి
భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని
మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు.
అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
112.
సూరా అల్ ఇఖ్లాస్
112:1 قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఓ ముహమ్మద్
సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు.
112:2 اللَّهُ الصَّمَدُ
అల్లాహ్
నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు).
112:3 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయన
(ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.
112:4 وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
ఆయనకు
సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
113.
సూరా అల్ ఫలఖ్
113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
చెప్పు:
నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –
113:2 مِن شَرِّ مَا خَلَقَ
ఆయన
సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,
113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
కటిక చీకటి
క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,
113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
(మంత్రించి)ముడులలో
ఊదే వారి కీడు నుండి,
113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
అసూయపరుడు
అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).
114.
సూరా అన్ నాస్
114:1 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఈ విధంగా)
చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.
114:2 مَلِكِ النَّاسِ
మానవుల
చక్రవర్తిని,
114:3 إِلَٰهِ النَّاسِ
మానవుల
ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –
114:4 مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
దురాలోచనలను
రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,
114:5 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
వాడు జనుల
హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –
114:6 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
వాడు జిన్ను
వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!